Saturday, October 20, 2018

శ్రీమన్నారాయణ నామస్మరణ మహాత్యం

ఒకసారి నారద మహర్షి కి ఓ అనుమానము వచ్చింది


నారాయణ నామస్మరణ వలన ప్రయోజనము ఏమిటాని? వెంటనే మహర్షి వైకుంఠము వెళ్ళి తన అనుమానమును శ్రీమన్నారాయణుని ముందుంచాడు. భగవంతుడు నారదమహర్షితో ఇలా అన్నాడు. “నారదా! ఇప్పుడే భూలోకంలో నైమిశారణ్యంలో ఒక కీటకం జననమెత్తింది. దానిని వెళ్ళి అడుగు” అని ఆకీటకాన్ని చూపించాడు. భగవంతుని ఆనతి మేరకు నారదుడు ఆకీటకము దగ్గరకు వెళ్ళి నారాయణ నామస్మరణ వలన ప్రయోజనము ఏమిటని ప్రశ్నించాడు. వెంటనే ఆకీటకము గిలగిలకొట్టుకుని చనిపోతుంది. విచారంగా నారదమహర్షి వైకుంఠము తిరిగి వెళ్ళి జరిగిన విషయము శ్రీమన్నారాయణునికి విన్నవించాడు. “ఒహో! అలాగా!! అయితే మళ్ళీ భూలోకం వెళ్ళి, కశ్యపుని ఆశ్రమములోనున్న కపిలగోవుకి జన్మించిన వత్సము(ఆవుదూడ)ను అడుగు” అని ఆనతిస్తాడు. నారద మహర్షి కశ్యపుని ఆశ్రమములోనున్నఆవుదూడ వద్దకు వెళ్ళి అదే ప్రశ్న వేస్తాడు. ఆ ప్రశ్నవినగానే ఆ ఆవుదూడకూడ గిలగిల తన్నుకుని చనిపోతుంది.నారదమహర్షి ఆశ్చర్యచకితుడయ్యి, విషయాన్ని శ్రీమన్నారాయణునికి తెలియపరుస్తాడు.శ్రీమన్నారాయణుడు “నారదా! ఇప్పుడే కాశీరాజుకు ఒక కుమారుడు జన్మించాడు. ఆ శిశువుని వెళ్ళి నీ ప్రశ్న వెయ్యి” అని చెపుతాడు. అప్పుడు నారదమహర్షి ” ప్రభూ, నావలన ఒకకీటకము ఆవుదూడ చనిపోయినవి. ఇప్పుడు శిశుహత్యాపాతకముకూడా నామెడకు చుట్టుకునేలావుంది.” అని శ్రీమన్నారాయణునితో వాపోతాడు. దానికి శ్రీమన్నారాయణుడు, “నారదా! నీకు ఏహత్యాపాతకము తగలదు. ఆశిశువు వద్దకు వెళ్ళి నీఅనుమానము నివృత్తిచేసుకో” అని అభయమిస్తాడు. శ్రీమన్నారాయణుని ఆజ్ఞమేరకు నారదమహర్షి ఆ కాశీరాజుకు జన్మించిన శిశువు దగ్గరకు వెళ్ళి తన సందేహము తీర్చమని అడుగుతాడు. అప్పుడాశిశువు పకపకానవ్వి “ఓ మహర్షి నేను అనేక జన్మలలో చేసిన పాపాల ఫలితముగా నీచమైన కీటకజన్మ ఎత్తవలసివచ్చింది. ఆజన్మలో నీవు వచ్చి “నారాయణ” అనే నామము నాచెవిలో పడవేసావు. ఆ అతిపవిత్రమైన నామము నాచెవిన పడగానే నాజన్మజన్మల పాపము నశించి పవిత్రమైన గోజన్మ వచ్చింది. ఆ జన్మలో కూడా నీవు వచ్చి మరల ఆ అతిపవిత్రమైన నామము నాకు వినిపించావు. తక్ష్ణమే ఆ పుణ్యఫలము అనుభవించనిమిత్తము ఈ కాశీరాజుకు కుమారునిగా జన్మించాను. ఇంతకన్నా నారాయణ నామస్మరణ మహాత్యము ఏమని చెప్పమంటావు! ఓ మహర్షి !” అని ఆ శిశువు మరల తన నరజన్మ అనుభవములోనికి వెళ్ళిపోతుంది.
నారదమహర్షి పరమానందభరితుడై శ్రీమన్నారాయణుని అనేకానేకములుగా స్తుతించి తన ఆశ్రమమునకు తిరిగి వెడతాడు.

భారతీయ శ్లోకాల్లో సైన్స్… ఆశ్చర్యపరిచే నిజాలు

భారతీయుల ఙ్ఞానసంపద ఒక మహా సముద్రం… అందులో మన ఋషులు, మునులు, ఆచార్యులు, గురువులు, పెద్దలు రచించిన శ్లోకాలు నీటి బిందువులు వంటివి. అందులో ఒకటంటే ఒక నీటి బిందువు చాలు… భారత దేశం “విశ్వగురువు” అని సగర్వంగా చెప్పడానికి.
హనుమాన్ చాలీసాలో ఒక శ్లోకం
తులసీదాస విరచిత హనుమాన్ చాలీసాలో ఒక శ్లోకం గురించి మాటాడుకుందాం…
“యుగ సహస్ర యోజన పర భానూ!
లీల్యోతాహి మధుర ఫల జానూ”!!
దీని తాత్పర్యం సవివరముగా తెలుసుకుందాం…
యుగ= 12,000 దివ్య సంవత్సరములు
సహస్ర=1000
యోజన్= 8 మైళ్ళు
యుగ x సహస్ర x యోజన= పర్ భాను
12000 x 1000 x 8 మైళ్ళు=96000000 మైళ్ళు
1 మైళు = 1.6 కిలో మీటర్లు
96000000 మైళ్ళు = 96000000 x 1.6 కిలో మీటర్లు =
153600000 కిలో మీటర్లు (ఇది భూమికి సూర్యునికి మధ్య దూరంగా కవి వర్ణన)
ఈ విషయాన్ని నాసావాళ్లు స్వయంగా ఒప్పుకోవడం కూడా జరిగింది. కాకపోతే నాసా(NASA) శాస్త్రఙ్ఞులు భూమికి సూర్యునికి మధ్య దూరాన్ని ఇంత ఖచ్చితంగా చెప్పలేదు.
According to Modren Astronomy and Science , we know that the earth’s orbit around the sun is not a circle and is slightly elliptical. Therefore, the distancebetween the earth and the sun varies throughout the year.
At its nearest point on the ellipse that is the earth’s orbit around the sun, the earth is 91,445,000 miles (147,166,462 kms) from the sun. This point in the earth’s orbit is known as Periapsis (perihelion) and it occurs around January 3.
The earth is farthest away from the sun around July 3 when it is 94,555,000 miles (152,171,522 km) from the sun. This point in the earth’s orbit is called Apoapsis (aphelion). The average distance from the earth to the sun is 92,955,807 miles (149,597,870.691 km).
హనుమంతుడు భువి నుండి సూర్యుణ్ణి చూసి దానిని ఒక తినే పండుగా భావించి సూర్య మండలానికి చేరుకున్నాడని మన ఇతిహాసాలు తెలిపిన విషయాలలో వాస్తవికతను గ్రహించిన విదేశీయులు ఆశ్చర్యచకితులవుతున్నారు.
వేల సంవత్సరాల క్రితమే మనకున్న విఙ్ఞానం అలాంటిది…!
ఇదీ మన భారత వైశిష్ట్యం…
ఇదీ మన వేద విఙ్ఞాన సారం…
ప్రతి భారతీయుడికి గర్వకారణం…
మన ఈ విఙ్ఞానాన్ని ప్రపంచానికి చాటుదాం…!

"పుణ్యం...అనగా"...

కాశీ పరమ పవిత్రమైన శైవ క్షేత్రం. కాశీ విశ్వేశ్వరుణ్ని దర్శిస్తే పాపాలన్నీ‌ నశిస్తాయని, ఇక పునర్జన్మ ఉండదని భక్తుల విశ్వాసం. అందుకని లక్షల సంఖ్యలో భక్తులు ప్రతిరోజూ విశ్వేశ్వరుడిని దర్శించుకొని వెళ్తుంటారు.
ఒక శివరాత్రి పండుగ రోజున అలా శివుడిని దర్శించుకునేందుకు బారులు తీరిన జనాల్ని చూసి, పార్వతి శివుడితో "స్వామీ! కాశీకి వెళ్ళిన వాళ్ళంతా కైలాసానికి వస్తారంటారే, మరి ఇంత మంది కైలాసానికి వచ్చేస్తే ఇక మనం ఉండేందుకు అక్కడ చోటు మిగలదేమో, ఎలాగ?" అన్నది.
శివుడు నవ్వి, "ఇంతమంది కైలాసానికి రావటం ఎలా సాధ్యం దేవీ? వీళ్ళలో ఒకళ్లిద్దరు ఉంటారేమో, కైలాసవాసానికి అర్హత ఉన్నవాళ్ళు!" అన్నాడు.
"ఎలాంటి వాళ్ళు?" అడిగింది పార్వతి.
"చూద్దాం, రా!" అని శివుడు పార్వతిని వెంట బెట్టుకొని బయలుదేరాడు.

శివపార్వతులు ఇద్దరూ ముసలివాళ్ళుగా మారారు. శివుడు తొంభై ఏళ్ళ ముసలివాడైనాడు. పార్వతి ఎనభై ఏళ్ళ ముసలమ్మ వేషం ధరించింది. ఇద్దరూ కాశీ విశ్వేశ్వరాలయ సింహద్వారం చేరారు. అక్కడ ముసలమ్మ తన భర్త తలను ఒళ్ళో పెట్టుకొని కూర్చున్నది. దేవాలయంలోకి వెళ్ళే వాళ్లందరినీ "అయ్యా, భక్తులెవరైనా దయ తలచండి! నా భర్త దాహం తీరేందుకు కొంచెం గంగా జలం పోయండి! నేను వెళ్ళి గంగా జలం తీసుకు రావటం సాధ్యం కాదు. నా భర్త ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు- ఏ క్షణంలోనైనా ప్రాణం పోవచ్చు. ఈ స్థితిలో నేను ఆయన్ని విడిచి వెళ్ళలేను. మీరెవరైనా కొంచెం సాయం చేయండి" అని వేడుకుంటున్నది.

గుడిలోకి వెళ్ళే భక్తులంతా అప్పటికే గంగానదిలో స్నానం చేసి, తడి బట్టలతో, చేతిలో ఉన్న పాత్రల్లో గంగా జలం నింపుకొని వస్తున్నారు. ఆ గంగ నీటితో విశ్వేశ్వరుణ్ని అభిషేకిస్తారు వాళ్ళు. "ఇదేమిటి, విశ్వేశ్వరుని దర్శనానికి వస్తే ఈ దరిద్ర దేవత ఎదురైంది?" అని కొందరు ముసలమ్మను తప్పించుకొని వెళ్ళారు. మరికొందరు "ఉండమ్మా, మేం ఇంకా దేవుడిని దర్శించుకోనే లేదు; అభిషేకం అయిన తర్వాత వచ్చి నీ భర్త సంగతి చూస్తాము" అని చెబుతూ లోనికి వెళ్లిపోయారు.
ఆ సమయంలో ఒక దొంగ వచ్చాడు అక్కడికి. "దేవాలయ సింహద్వారం దగ్గర‌ భక్తులు క్రిక్కిరిసి ఉన్నారు. 'జేబులు కొట్టవచ్చు; అలాగే ఆడవారి మెడలలోని నగలు అపహరించవచ్చు" అని వచ్చాడు ఆ దొంగ. అందరినీ అడిగినట్లే ముసలమ్మ ఆ దొంగను కూడా అడిగింది-"అయ్యా! మేం విశ్వేశ్వరుడిని దర్శించేందుకు వచ్చాం. కానీ వయసు పైబడిన నా భర్త అలసిపోయి, ఇక్కడే కూలబడ్డాడు. ఎవరైనా పుణ్య ప్రభువులు, ఇంత గంగా జలం తెచ్చి ఆయ నోట్లో పోస్తే సేదతీరుతాడేమో. అందరినీ అడుగుతున్నాను నాయనా, నువ్వైనా దయచూడు" అని. 

దొంగ చేతిలో ఒక సొరకాయ బుర్రనిండా గంగ నీళ్ళు ఉన్నాయి. అతను "దానిదేముంది అవ్వా, ఇప్పుడే తెచ్చుకున్నాను గంగ నీళ్ళు- ఇవిగో!" అని ఆ నీళ్ళను ముసలాయన నోట్లో పోసేందుకని మోకాళ్ళపైన కూర్చున్నాడు.

అవ్వ అన్నది- "కాస్త ఆగు నాయనా! ఆయన నోట్లో నీళ్ళు పోసేముందు, నువ్వు చేసిన పుణ్యకార్యాల్లో ఏదో ఒకటి చెప్పి, ఆ పైన నీళ్ళు పొయ్యి బాబూ! నీ పుణ్యంవల్లనైనా ముసలాయన మంచి లోకాలకు పోతాడు" అని.
దొంగకు ఏం చేయాలో తోచలేదు. గుర్తు ఎరిగిన నాటి నుండీ 'తను చేసిన మంచి పని' అంటూ ఒక్కటీ లేదు! ఇలా తన పుణ్యాన్ని లెక్కించుకునే అవసరమూ ఏనాడూ ఎదురవ్వలేదు! అతను సిగ్గు పడుతూ అన్నాడు ముసలమ్మతో- "అమ్మా, నేనొక దొంగను. ఇంతవరకూ నేను ఒక్క పుణ్యకార్యం కూడా చేయలేదు. ఇదిగో, ఇప్పుడు, ఈయన నోట్లో గంగాజలం పోద్దామనుకున్నానే, ఇదొక్కటే కావొచ్చు, నేను చేస్తున్న మంచి పని" అని చెప్పి, ముసలాయన నోటిలో నీరు పోశాడు అతను.
మరుక్షణం శివ పార్వతులు ఆ దొంగకు నిజరూపాలతో దర్శనం ఇచ్చారు: "నాయనా, నిజం చెప్పటం ద్వారా నువ్వు ఈనాడు గొప్ప పుణ్యం సంపాదించుకున్నావు. సత్యాన్ని మించిన ధర్మం లేదు. నువ్వు చేసిన ఈ ఒక్క మంచి పని వల్ల, ఇంతకాలంగా చేసిన పాపాలన్నీ‌ పటాపంచలయ్యాయి. ఇకపైన చెడు పనులు చేయకు. పవిత్రంగా బ్రతుకు. మానవ సేవే పరమార్థంగా భావించిన నువ్వు, జన్మాంతంలో‌ కైలాసానికి చేరుకుంటావు" అని, వాళ్లు అంతర్థానమయ్యారు. ఆపైన దొంగ పూర్తిగా మారిపోయాడు. జీవితాంతం మంచిపనులు చేస్తూ గడిపాడు.

"చూశావా! ఇలాంటి ఏ కొందరో వస్తారు, కైలాసానికి. పరోపకారాన్ని మించిన ప్రార్థన లేదు" అన్నాడు శివుడు, పార్వతితో. "అవును" అన్నది పార్వతి, అంగీకరిస్తూ...

💐ఓం నమః శివాయ💐

ప్రకృతి అందించిన గురువులు

🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾🌾
సద్గురువులు కావాలని ఈరోజుల్లో ఎందరో ఎదురుచూస్తున్నారుకాని మనం పుట్టిన నాటి నుండి చనిపోయే వరకు నిత్యం క్షణకాలం పాటు మనల్ని విడువకుండా ఉండే గురువులును ఎందుకు గుర్తించలేకపోతున్నారు?
ప్రకృతి ఇచ్చిన గురువులు: నేల, నింగి, గాలి, నీరు, నిప్పు, పంచభూతాలు. ప్రకృతి లో ఉన్న ఈ పంచభూతాలతో నిర్మితమైనదే మానవదేహం.
నేల : ఎందరు ఎన్నిరకాలుగా వాడుకున్నా సహిస్తుంది. నేలకు సహనం సహజగుణం. పుట్టిన దగ్గర నుండి నిన్ను మోసి, చివరికి తనలో కలుపుకుంటుంది. ఇలాంటి నేలను చూసి మీరు ఏమి నేర్చుకున్నారు?
నీరు : ఎన్ని మలినాలు చేసినా సహజంగా శుద్ధి చేసుకుంటుంది. అలానే కాక శుబ్రం చేసే గుణం కలిగి ఉంది. మనషి ఎల్లప్పుడూ శుచిగా ఉండాలనే జ్ఞానాన్ని సూచిస్తుంది. దీనిని చూసి ఏమి నేర్చుకున్నావు?
నిప్పు : మలినాలను పోగొడుతుంది. దేవతలకు మనం చేసే యజ్ఞంయాగాది క్రతువుల నుండి ఆహారాన్ని అందిస్తుంది. లోకాలకే వెలుగులు ప్రసాదిస్తుంది. నిప్పులో నిర్మలత్వం ఉంది. దీని వలన ఏమి నేర్చుకున్నావు?
గాలి : ఎప్పుడూ నిరాపేక్షంగా ఉపకారం చేస్తుంది. పువ్వులలో ఉండే పుప్పొడిని తీసుకెళ్ళి పరపరాగ సంపర్కం గావించి వృక్ష సంపదను వృద్ది పొందిస్తుంది. మనిషికి నిరంతరం చెట్లనుండి ఆక్సిజన్ అందిస్తుంది. ఇలా గాలిని పరోపకార బుద్ది నేర్పుతుంది. దేనిలో ఉన్న పరోపకార బుద్దిని అలవరచుకున్నారా?
ఆకాశం : ఎన్ని కారుమబ్బులు కమ్ముకున్నా ఆకాశం ఎప్పటికీ నిర్మలంగానే ఉంటుంది. మనిషి జీవితం మాయ ప్రపంచం చుట్టూ తిరుగుతూ మనస్సుకు అనేక మాయలు కల్పిస్తుంది. ఈ మాయల మబ్బుల నుండి వివడటానికి నిర్మలత్వాన్ని చూపిస్తున్న ఆకాశం నుండి ఏమి తెల్సుకున్నారు?
తుమ్మెద పువ్వులలో ఉన్న తేనెను మాత్రమే ఆస్వాదిస్తుంది. మనిషికూడా విషయంలో ఉన్న సారాన్ని మాత్రమే గ్రహించాలి. కాని మనిషి మాత్రం విషయాన్నే వక్రీకరణ బుద్దితో ఆలోచిస్తున్నాడు.
చేపను చూసి జిహ్వ చాపల్యం చంపుకోవాలి. ఎరను చూసి పట్టుకోవాలని ప్రయత్నించి చివరికి చనిపోతుంది. మనిషి కోరికల ఎరకు చిక్కి ఆయుష్షుని తగ్గించేసుకున్తున్నాడు.
చివరికి అమ్మాయి చేతికి ఉన్న గాజు కూడా గురువే. ఒక్కగాజు నిశబ్దంగా ఉంటే నాలుగు గాజులు గోలచేస్తాయి. ఒంటితనం తోనే మనిషి ఏదైనా సాధించడానికి అవకాశం కలిగిస్తుంది. నలుగురిలో ఉంటే విషయం మీద ధ్యాస తగ్గిపోతుంది.
ఇలా ప్రకృతిలో ఉన్న ప్రతి ఒక్కటీ మనకు అనేకరకాలుగా భోదిస్తుంటే మనం మాత్రం పట్టించుకోవడం లేదు. మరి గురువులు చెప్పే విషయాలు వింటారా?

హిందు అనే పదం మన ధర్మానికి ఎలా వచ్చింది?

చాలా మందికి హిందు అనే పదం మన ధర్మానికి ఎలా వచ్చింది అనేది తెలియని వారు చాలమంది ఉన్నారు.. క్రైస్తవులు ఇది ఎదో జికే క్వశ్చన్ ల మన హిందువులను అడుగుతుంటారు అలాంటివ్వారందరి కోసం ఈ పోస్టు.....
హిందూ ధర్మం (Hinduism orHindu Dharma) భారతదేశంలో జన్మించిన ఒక ఆధ్యాత్మిక సాంప్రదాయం. హిందూ మతం అతి పురాతన మతం. దీనినే 'సనాతన ధర్మం' అని కూడా తరచు వ్యవహరించడం జరుగుతుంది. పూర్వకాలమునందు భారతదేశమున ఏది ధర్మనామముతో వ్యవహరింపబడినదో, అదియే ఇపుడుమత మను పేరుతో వాడబడుచున్నది.ధర్మము అనగా ఆచరణీయ కార్యము.మత మనగా అభిప్రాయము . హిందూ అనే పదమును ఫార్సీలు మొదట వాడేవారు, హిందు అనే పదానికి ఫార్సీ భాషలో సింధు అని అర్థము,#సింధూనది ఒడ్డున నివసించే వారిని అలా పిలచేవారు కాని ఇప్పుడు వేదాలు మరియు వాటికి సంబంధించిన మతాలను ఆచరించే వారినే హిందువు అని పిలుస్తున్నారు. హిందూమతం మరియు దాని మూలాలు వేదకాలపు నాగరికతకు సంబంధించినవి.ప్రపంచంలోనే అన్నింటికన్నా ప్రాచీనమైనది. వివిధ రకాలైన భిన్న విశ్వాసాల కలయికయైన #హిందూధర్మాన్ని ఏ ఒక్కరో కనుగొన్నట్టు ఆధారాలు లేవు.

ఇస్లాం, మరియు క్రైస్తవం, తరువాత ప్రపంచంలోనే మూడవ అతి పెద్ద మతం. సుమారు ఒక బిలియన్ హిందూ జనాభాలో 905 మిలియన్లు భారతదేశం మరియు నేపాల్ లోనే నివసిస్తున్నారు. ఇంకా హిందువులు ప్రధానంగా ఉన్న దేశాల్లో బంగ్లాదేశ్,శ్రీలంక, మలేషియా, ఇండోనేషియా, సింగపూర్,_మారిషస్, ఫిజి, సూరినాం, గయానా, ట్రినిడాడ్మరియు టుబాగో, అమెరికా, రష్యా మరియు చైనాముఖ్యమైనవి
హిందువుల వేద సంపద చాలా అమూల్యమైనది. కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి వస్తున్న వేదాలను చెప్పబడిన వాటిగా, గుర్తుంచుకోబడిన వాటిగా విభజించవచ్చు. ఈ వేదాలు వేదాంత శాస్త్రం, తత్వ శాస్త్రం, పురాణాలు,మరియు ధర్మాన్ని ఆచరించడానికి కావలసిన లోతైన జ్ఞానాన్ని విశదీకరిస్తాయి. సాంప్రదాయం ప్రకారం వేదాలు మరియు ఉపనిషత్తులుఅతి పురాతనమైనవి, ముఖ్యమైనవి, ప్రామాణికమైనవి. ఇంకా తంత్రాలు, ఆగమాలు,పురాణాలు మరియు మహా కావ్యాలైనటువంటిరామాయణం, మహాభారతం కూడా ముఖ్యమైనవే. కొన్నిసార్లు భగవద్గీత అన్ని వేదముల సారాంశముగా భావించబడుతోంది.
క్రొత్త రాతియుగం నుండి హరప్పా మొహంజొదారో నాగరికత కాలం వరకు హిందూమతం గురించిన పురాతన ఆధారాలు ఉన్నాయి.(5500–2600BCE)(1500–500BCE) కాలానికి చెందిన అంశాలను 'చారిత్రిక వైదిక ధర్మం'కు చెందినవని అంటారు.
వేదాల ఆవిర్భావం నుండి హిందూమతం ఆచారాలు, సిద్ధాంతాలలో ఏర్పడిన స్పష్టత ఇప్పటికీ కొనసాగుతున్నది. వీటిలో అతి పురాతనమైన [[ఋగ్వేదం]] 1700–1100 BCE కాలానికి చెందినదని ఒక అభిప్రాయం. వేదాలలో ఇంద్రుడు, వరుణుడు,అగ్ని వంటి దేవతల ఆరాధన, సోమయాగం వంటి యజ్ఞకర్మలు బహుళంగా చెప్పబడ్డాయి. విగ్రహారాధన కంటే మంత్రారాధన, యజ్ఞకాండలు వేదసాహిత్యంలో ప్రాముఖ్యత వహిస్తాయి. ఋగ్వేదంలోని ఆచారాలు, విశ్వాసాలు [[జొరాస్ట్రియన్ మతము|జొరాస్ట్రియన్ మతాని]]కి కొంత సారూప్యం కలిగి ఉన్నాయి.
వేదాల తరువాతి కాలాన్ని పురాణాల కాలంగాపేర్కొంటారు. వీటిలో మొదటివైనరామాయణం,మహాభారతం 500–100BCE, కాలంలో రూపుదిద్దుకొన్నాయి. తరువాత అనేక పురాణాలు వెలువడ్డాయి. పురాణాలలోని వివిధ అంశాలు నేటి హిందూమతాచారాలు, వ్యవహారాలు, విశ్వాసాలకు ప్రధాన ప్రమాణాలు.
హిందూ మతాన్నీ, అందులోని నమ్మకాలనూ మౌలికంగా ప్రభావితం చేసి, క్రొత్త పరిణామాలకు దారితీసిన మూడు ముఖ్యాంశాలు - ఉపనిషత్తులు,జైన మతము, బౌద్ధ మతము వీటిలో వేదాల సాధికారతను, వర్ణ వ్యవస్థ బంధాన్ని అంగీకరించకుండా మోక్షము లేదా నిర్వాణం పొందడం గురించి చెప్పబడింది.[ఆధారం చూపాలి]. గౌతమ బుద్ధుడుమరింత ముందుకు వెళ్ళి ఆత్మ లేదా భగవంతుడు అన్న నమ్మకాలను ప్రశ్నించాడు. మౌర్యుల కాలంలో బౌద్ధం దేశమంతటా వర్ధిల్లింది (క్రీ.పూ 300 నుండి క్రీ.శ. 200 వరకు). తరువాత వివిధ వేదాంత దర్శనాలుఅనేక విధాల సిద్ధాంతాలను ప్రతిపాదించాయి. వీటిలో క్రీ.పూ. 6వ శతాబ్దం నాటి చార్వాకుని నాస్తిక వాదం కూడా ఒకటి. క్రమంగా మళ్ళీ బౌద్ధమతాన్ని అణగద్రొక్కి హిందూమతం క్రీ.పూ. 400 నుండి క్రీ.శ. 1000 కాలంలో బలపడింది.
క్రీ.శ. 7వ శతాబ్దంలో భారతదేశంలో అరబ్బు వర్తకుల ద్వారా ప్రవేశపెట్టబడిన ఇస్లాం మతం తరువాత ముస్లిం పాలనా సమయంలో దేశమంతటా విస్తరించింది. ఈ కాలంలో రెండు మతాల మధ్యా వివిధ స్థాయిలలో ఘర్షణలు చోటు చేసుకొన్నాయి. అదే సమయంలో సహ జీవన విధానాలు కూడా అభివృద్ధి చెందాయి. తరువాతి కాలంలో రామానుజాచార్యులు,మధ్వాచార్యులు, చైతన్యుడు వంటి ప్రవక్తల బోధనల వల్ల హిందూమతంలో మరికొన్ని నూతన విధానాలు నెలకొన్నాయి.

నేనింక ఈ మంత్రం జపం చేయను , నమ్మకం పోయింది

శిష్యుడు-- “గురువుగారూ, నేనింక ఈ మంత్రం జపం చేయను.”
గురువు-- “ఏమైంది నాయనా?”
శిష్యుడు-- “రోజూ క్రమం తప్పకుండా చేస్తున్నాను. ఇంతవరకూ ఏం ఫలితం దొరకలేదు.”
గురువు-- “ప్రారంభించి ఎంత కాలమైంది?”
శిష్యుడు-- “నెల రోజులైంది. భగవన్నామం ఒక్కసారి చేస్తే చాలు పాపాలన్నీ పోతాయన్నారు.. మరి నాకు రవంత ప్రశాంతతైనా దొరకదేంటి? మంత్రంలో బలం ఉంటే పని చేయాలి కదా! కనీసం కాస్తైనా నా లోపలి బరువు తగ్గాలి కదా!”
గురువు-- “ఓర్పు పట్టాలి నాయనా. తప్పక కలుగుతుంది. ఇట్టివి నెమ్మదిగా పని చేస్తాయి, కానీ తప్పక పని చేస్తాయి. నీకిచ్చినది మహామంత్రం.”
శిష్యుడు-- “లేదండి. రోజూ శుచిగా ముప్పూటలా స్నానాలు చేస్తాను. సమస్త నియమాలు పాటిస్తూ, ఏకభుక్తం చేస్తూ, మౌనవ్రతం కూడా అవలంబిస్తూన్నాను. పగలు పడుకోను. చాప మీద పడుకుంటాను. ఎక్కువ మాట్లాడను. అరిషడ్వర్గాలకు లోనవ్వటం లేదు. ఇంద్రియాల తృప్తికోసం జీవించటం మానేశాను.”
గురువు-- “నాకు తెలుసు నాయనా. నీలో చాలా మార్పు ఉంది. ఇతరత్రా భూమిక సిద్ధమవుతున్న సూచన స్పష్టంగానే కనిపిస్తున్నది. ఫలితం గురించి ఇప్పుడే చూడకు. నీకు కనిపించని స్థితిలో అది పని చేస్తున్నది.”
శిష్యుడు-- “లేదండి. నాకు పూర్తిగా నమ్మకం పోయింది. నేను వదిలేస్తాను. వదలాలంటే ఏంచేయాలో చెప్పండి. గోవు చెవులో ఊదటమో ఏదో పద్ధతులుంటాయి కదా!”
గురువు-- “సరే- తప్పక చెప్తానవి. కానీ ముందు నువ్వొక పని చేయి. ఈ మామిడి టెంక మన ఆశ్రమం పెరట్లో నాటి రా. వచ్చి రేపు కనిపించు.”
శిష్యుడు-- “అట్లాగేనండి.”
(నాటి వెళిపోతాడు. మరునాడు వస్తాడు.)
శిష్యుడు-- “మంత్రం విడిచే మార్గం చెప్పండి.”
గురువు-- “నువ్వు నిన్న నాటిన టెంక నాటుకుందా, చూశావా?”
శిష్యుడు-- “లేదండి, నిన్ననే కదా పెట్టింది.”
గురువు-- “సరిగ్గా పెట్టావా, లోతుగా తవ్వావా, మట్టి పూర్తిగా కప్పావా?”
శిష్యుడు-- “ఆఁ.. అన్నీ సరిగ్గానే చేశానండి. సూర్యరశ్మి తగిలే చోటే పెట్టాను. వేరే చెట్టు ఛాయలో కాక విడిచోటే పెట్టాను. తగినంత నీరూ పోశాను. ఇవాళ లోపలకు వస్తూ కూడా నీళ్ళు పోశాను. “
గురువు-- “అయినా పండు రాలేదా?”
శిష్యుడు-- “అదేంటండి, టెంక నాటుకోవాలంటే సమయం పడుతుంది కదా. అది మొక్కై, చెట్టై, పూసి కాస్తే కదా పండొచ్చేది?”
గురువు-- “నిజమే. కానీ టెంకలో బలం లేదేమో..! లేతే ఈ పాటికి కనీసం చిన్న పిలకైనా బయటకు కనిపించాలి కదా.”
శిష్యుడు-- “లేదండి. అది మట్టిలో మొదలు ఇమడాలి. దానిలో ఉన్న నాటుకునే శక్తి చైతన్యవంతం కావాలి. చాలా సమయం పడుతుంది.”
గురువు-- “అవన్నీ నిజమే. కానీ ఇన్ని గంటలైంది కదయ్యా. నాకు నమ్మకం పోయింది. అదింక నాటుకోదేమో.”
(శిష్యుడు ఏదో అర్థమైనట్టు తలవంచుకుంటాడు.)
గురువు-- “దాన్ని తవ్వి తీసి పెరికి అవతలపారేసేయి.. నేనింక ప్రతీక్షించలేను. పో.”
శిష్యుడు-- “నాకు మీ సమాధానం అర్థమైందండి. ఇంకెప్పుడూ మంత్రం చేయనని వదిలేస్తానని అనను. క్షమించండి.”

ఒక నీతి కధ

ఒక సాధువు నడిచి వెళుతూ అలసటగా ఉంటే ఒక చెట్టు కింద కూర్చున్నాడు..
ఎదురుగా వున్న ఇంట్లోని గృహస్థుడు ఆయన్ని చూసి తమ ఇంట్లోకి వచ్చి కొంచెం సేపు విశ్రాంతి తీసుకోమని కోరాడు. సాధువుకి మంచి భోజనం పెట్టి, చీకటి పడింది కదా ఈ పూటకి ఇక్కడే వుండమని కోరాడు ఆ ఇంటి యజమాని. మాటల్లో తన కష్టసుఖాలు ముచ్చటిస్తూ, యజమాని,

" ఏమిటో నండీ ! సంసారంలో సుఖం లేదండీ..మీజీవితమే హాయి !! అన్నాడు
వెంటనే ఆ సాధువు " అయితే నా వెంట రా ! నీకు మోక్ష మార్గం చూపిస్తాను " అన్నాడు.
యజమాని కంగారుపడుతూ.
" అలా ఎలా కుదురుతుంది ??
పిల్లలు చిన్నవాళ్ళు.. వాళ్ళను పెంచి పెద్ద చేయాలి కదా !!" అన్నాడు. సాధువు మాట్లాడలేదు. కొన్ని సంవత్సరాలు గడిచాయి.
ఆ సాధువు మరల అదే మార్గంలో వస్తూ ఆ ఇంటిని చూ‌సి ఆగాడు. ఆయన్ని చూసి యజమాని సాదరంగా ఆహ్వానించి, అతిథి మర్యాదలు చేశాడు.మాటలలో సాధువు అన్నాడు, " పిల్లలు పెద్దవాళ్లు అయ్యారు కదా నా వెంట రా! నీకు మోక్ష మార్గం చూపిస్తాను " యజమాని తడబడుతూ " ఇప్పుడే కాదు స్వామీ ! పిల్లలు స్థిరపడాలి...
వాళ్ళ పెళ్ళిళ్ళు చేయాలి ....." అన్నాడు.
ఇంకా కొన్ని సంవత్సరాలు గడిచాయి. సాధువు మళ్లీ అదే.... యజమాని ఆతిథ్యం... సాధువు అదే మాట ..... యజమాని జవాబు కొంచెం విసుగ్గా.." పిల్లలకి డబ్బు విలువ తెలియదు.. అందుకని నేను దాచినంతా ఆ చెట్టు కింద పాతిపెట్టాను..వీలు చూసుకుని చెబుతాను. ఒక పెద్ద ఇల్లు కట్టాలి.. మీలాగా నాకు ఎలా కుదురుతుంది " అన్నాడు..
ఇంకా కొన్ని సంవత్సరాలు గడిచాయి
సాధువు మళ్లీ అదే మార్గంలో వస్తూ ఆ ఇంటి వంక చూడకుండా వెళ్ళి పోతుండగా ఆ యజమాని కొడుకు గమనించి ఆహ్వానించాడు .
అతను తమ తండ్రి మరణించాడని చెప్పాడు.. సాధువు కి కొంచెం బాధనిపించింది.
ఆతిథ్యం స్వీకరించి బయటికి వచ్చాడు.. చెట్టు కింద ఒక కుక్క కూర్చుని వుంది యజమాని అనుమానంగా దాని వంక చూశాడు..
సందేహంలేదు యజమాని కుక్కగా పుట్టాడు.. సాధువు మంత్రజలం దాని మీద జల్లి ,
" ఏమిటి నీ పిచ్చి మోహం ??? 🐕 గా పుట్టి ఇంటికి కాపలా కాస్తున్నావా ?? నా వెంట రా.. నీకు మోక్ష మార్గం చూపిస్తాను "
అన్నాడు.. యజమాని " ఆ మాట మాత్రం వినలేను..
ఎందుకంటే నేను డబ్బు ఇక్కడ దాచిన సంగతి పిల్లలకి చెప్పలేదు ఎవరూ దోచుకోకుండా చూడాల్సిన బాధ్యత నాదే కదా " అన్నాడు.
మళ్ళీ కొన్నాళ్ళకి సాధువు ఆ దారిన వస్తూ ఆ ఇంటి వైపు చూశాడు . కుక్క కనపడలేదు పక్కవారిని అడిగితే అది పోయిందని చెప్పారు.అయినా సాధువు అనుమానంగా చుట్టూ చూస్తుంటే చెట్టు కింద ఒక పాము కనిపించింది.. పరీక్షగా చూసాడు ఖచ్చితంగా ఆ యజమాని మళ్ళీ 🐍 గా...
మంత్రజలం చల్లి, " ఇంకా ఈ ఇంటిని వదిలి వెళ్ళవా ???
నాతో.............
........" అన్నాడు
ఆ ఒక్క మాట మాత్రం అనకండి. నా సొమ్ము పిల్లలకి కాకుండా ఇతరులకి దక్కనీయకుండా చూడాలి కదా అన్నాడు దీనంగా..
సాధువు వెంటనే అతని ఇంట్లోకి వెళ్లి , అతని కొడుకులతో " మీ నాన్న ఆ చెట్టు కింద దాచిపెట్టాడు. కానీ జాగ్రత్త! అక్కడ పాము ఉంది " అన్నాడు.అనగానే కొడుకులు ఎగిరి గంతేసి,,
కర్రలు తీసుకుని బయలుదేరారు. తన కొడుకులే తనను కర్రలతో చావగొడుతుంటే అతను దీనంగా సాధువు వంక చూశాడు
కానీ అప్పటికే చాలా ఆలస్యమైంది

నీతి
గృహస్థాశ్రమం లో బాధ్యతలు తప్పవు కాని మోహబంధాలు ఎంత గట్టిగా మనం కట్టేసుకోవాలి అనే వివేకం చాలా అవసరం.
ఇహమే కాదు పరం గురించి కూడా మనం తప్పనిసరిగా ఆలోచించాలి .... !!!

హనుమంతుడు సింధూరం ఎందుకు ధరిస్తాడు హనుమంతుడు సింధూరం ఎందుకు ధరిస్తాడు..?

హనుమంతుడు సింధూరం ఎందుకు ధరిస్తాడు హనుమంతుడు సింధూరం ఎందుకు ధరిస్తాడు..? ప్రత్యేకత ఏమిటి...?

హిందూ సాంప్రదాయాలలో సింధూరానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. పార్వతీ దేవికి ప్రతీకగా సింధూరాన్ని భావిస్తారు.
హిందూ ఆస్ట్రాలజీ ప్రకారం మేష రాశి స్థానం నుదిటిపైన ఉంటుంది. మేష రాశి అధిపతి అంగారకుడు. అంగారకుడి రంగు ఎరుపు. అందుకే ఈ రంగుని శుభప్రదంగా భావిస్తారు. సౌభాగ్యానికి, అదృష్టానికి ప్రతీకగా ఎరుపు రంగును భావిస్తారు. అందువల్ల ఎరుపు
రంగు అదృష్టాన్ని తీసుకువస్తుందని నమ్ముతారు.


పూర్వం శ్రీరామ పట్టాభిషేకం తర్వాత ఒక రోజు సీతమ్మ తలస్నానం చేసి, నుదుటన తిలకం దిద్ది, పాపిటన ‘సింధూరం' పెట్టుకొని, శ్రీరామునితో కలిసి విశ్రాంతి మందిరానికి వెళుతున్న సమయంలో, అప్పటి వరకూ శ్రీరాముని సేవకై వేచి ఉన్న ఆంజనేయుడు వారి వెనుకనే వెళ్ళసాగాడు. ఇది గమనించిన సీతారాములు వెనుకకు తిరిగి చూడగా, సీతాదేవి హనుమంతునితో‘మేము విశ్రాంతి  మందిరానికి వెళుతున్నాము, నీవు రాకూడదు, వెళ్ళు హానుమా...తరువాత రావచ్చు' అనెను. రాములవారు కూడా ‘సీతమ్మవారు చెప్పినట్లు చేయుము హనుమా..ఇప్పుడు రావద్దు..'అనెను. అంతట ఆంజనేయుడు ‘రామా! మిమ్ములను సేవించనిదే నాకు
కునుకు పట్టదు కదా...మీరును సీతమ్మ చెప్పినట్లే పలికెదరేమి? మీరు స్త్రీ దాసులై పోతిరేమి రామ''అనగా, రాములవారు  హనుమంతునితో‘నేను వివాహ సమయమున ఆమె పాపిట చిటికెడు సింధూరం పెట్టితిని. అందుకు కారణంగా ఆమెకు దాసుడనైతిని' అని తెలిపాడు. 


హనుమంతుడు ఆశ్చర్యంతో ‘అమ్మా! మీ నుదుట తిలకముంది కదా!పాపిటన సింధూరం దేనికి' అని అడిగాడు. అప్పుడు సీతాదేవి‘నాయనా హనుమా! స్వామి వారికి ఇంకా సౌభాగ్యం కలగాలని పాపిటన సింధూరం ధరించానని' చెబుతుంది. వెంటనే హనుమంతుడు అయోధ్యా నగరంలోని అంగడి నందు సింధూరంను తీసుకొని దాని నంతటిని నువ్వుల నూనెతో పలుచగా చేసుకొని తన తలాతోకా అనుకోకుండా పాదాది శిర: పర్యంతము ఎక్కడను సందులేకుండా సింధూరం రాసుకొని వెంటనే సీతారాముల దర్బారుకు పట్టరాని ఆనందంతో వెళ్ళాడు. హనుమంతుని రూపం చూసి అక్కడి వారంతా ముసిముసినవ్వులు నవ్వుతుండగా, శ్రీరామచంద్రుడు చిరునవ్వుతో హనుమను చేరదీసి ‘హనుమా! ఇదేమిటి‘ అని అడగగా, హనుమంతుడు ‘మీరు చిటికెడు
సింధూరమును సీతమ్మవారికి అలంకరించుట చేతనే ామెకు వశపడితిరి కదా, చిటికెడు సింధూరంతోనే మీకు సౌభాగ్యం కలిగితే, మరి నేను శరీరం మొత్తం సింధూరం అలంకరించుకున్నాను. మరి మీరు నాకు వశపడేదరా లేదా ప్రభూ! మీకు ఇంకెంత సౌభాగ్యం కలుగుతుందో కాదా" అని ఆనందంతో, సంతోషంతో కేరింతలు కొట్టసాగాడు. హనుమ పలుకులు విన్న శ్రీరాముడు, తన సభలోని వారందరూ వినేలా ‘ఆంజనేయా! నీవంటి భక్తుడు ఈ పద్నాలుగు భువనాల్లోనే కాక మరెక్కడా ఉండడు. నీవు ధరించిన ఈ సింధూరాన్ని తిలకంగా ధరించిన వారికి, మన అనుగ్రహంతో పాటు అపారమైన సిరిసంపదలు, సుఖ సంతోషాలు కలుగుతాయి. అంతే కాక నీవు సీతాన్వేషణ సమయంలో సీత జాడ తెలుసుకొని ఆమెకు గుర్తుగా శిరోమణిని నాకు తెచ్చి ఇచ్చిన మంగళవారం నాడు, నీ జన్మదినమైన శనివారం నాడు ఎవరైతే భక్తీ శ్రద్ధలతో నుదుట ఈ సింధూరం ధరిస్తారో, వారికి ఆయురారోగ్యములు,
సుఖ సంపత్తులు సంపూర్ణంగా లభిస్తాయి'అని వరదానం చేశాడు. భక్త జనుల అభీష్టములు తీర్చేవాడు ఆంజనేయస్వామి. అందుకే ఆనాటి నుండి సింధూర ప్రియుడు అయినాడు.

ఆంజనేయస్వామి సింధూరాన్ని పెట్టుకుంటే లాభాలు!

1. ఎవరింట్లో అయితే నిత్యం కలహాలు జరుగుతుంటాయో అటువంటి వారు ప్రతిరోజు సింధూర ధారణ చేపడితే అన్ని రకాల దాంపత్య సమస్యలు తొలగిపోతాయి.
2. ఎవరింట్లో అయితే భీతి, భయం వెంటాడుతుంటాయో అటువంటి వారు సింధూరాన్ని పెట్టుకుంటే భయం తొలగిపోతుంది.
3.ఎవరి ఇంట్లో అయితే భార్యభర్తలు, పిల్లల మధ్య సఖ్యత ఉండదో అటువంటి వారు సింధూరాన్ని పెట్టుకుంటే సుఖం, సంతోషం ప్రశాంతత లభిస్తుంది.
4. చిన్నపిల్లలకు బాలగ్రహ దోషాలు ఉంటే ఆ పిల్లలకు సింధూరాన్ని పెడితే భయం, భీతి, రోగ బాధలు ఏమీ దచిచేరవు. ఆరోగ్యవంతులుగా ఉంటారు.
5. వివాహమైన కొత్త దంపతులు ఆంజనేయస్వామి సింధూరాన్ని పెట్టుకుంటూ ఉంటే వారికి పిల్లలు కలుగుతారు.
6. విద్యార్థులు, విధ్యార్థినులు ఆంజనేయస్వామి గుడికి వెళ్లి సింధూరాన్ని పెట్టుకుంటే పరీక్ష సమయంలో చదివిన విషయాలన్నింటినీ మరిచిపోకుండా ఉంటారు.
7. లో బీపీ ఉన్నవారు రక్త మీనత సమస్యలతో బాధపడేవారు ఆంజనేయస్వామి తీర్థాన్ని సేవించి సింధూరాన్ని నుదుటికి పెట్టుకుంటే ఆరోగ్య భాగ్యం సిద్దిస్తుంది.
8. గ్రహ బాధలు ఉన్నవారు ప్రతిరోజు సింధూరాన్ని పెట్టుకుంటే గ్రహాల బాధ తొలగిపోతుంది.
9. ఇంట్లో ఆంజనేయస్వామికి గంధాన్ని పూయదలచినవారు దేవుని చిత్రాన్ని దక్షిణం వైపు ఉంచి కొద్దిగా గంధాన్ని స్వామి కిరీటానికి పెట్టాలి. తరువాత అంతా గంధం పూసుకుంటూ వచ్చి చివరిగా గంధాన్ని పాదం వద్ద పెట్టి పూజిస్తే తలచిన వన్నీ నెరవేరుతాయి.

దైవం మీద నమ్మకమే మోక్షానికి దారి

త్రిలోకసంచారి అయిన నారదుడు ఒకసారి భూమి మీద ఉన్న విష్ణుభక్తులను పలకరించేందుకు బయల్దేరాడు. అక్కడ ముందుగా ఆయన నిత్యం హరినామస్మరణలో లీనమయ్యే ఓ ముని దగ్గరకు వెళ్లాడు.
‘అయ్యా! వైకుంఠం నుంచి ఎప్పుడు వచ్చారు. విష్ణుభగవానుడు ఎలా ఉన్నారు?
ఏం చేస్తున్నారు? మీరు తరచూ వైకుంఠానికి వెళ్తూ ఉంటారా?’ అని ప్రశ్నలతో ముంచెత్తాడు ఆ ముని.
‘విష్ణుమూర్తుల వారు బాగానే ఉన్నారు. నేను వైకుంఠానికి తరచూ వెళ్తూనే ఉంటాను,’ అంటూ బదులిచ్చారు నారదులవారు.
‘అయితే స్వామీ! ఈసారి మీరు వైకుంఠానికి వెళ్లినప్పుడు నాకు మోక్షం ఎప్పుడు ప్రసాదిస్తారో దయచేసి స్వామివారిని అడగండి’ అని వేడుకున్నాడు ఆ ముని.
సరేనంటూ నారదులవారు ముందుకు సాగిపోయారు. ఈసారి ఆయనకు ఒక చెప్పులు కుట్టుకునేవాడు కనిపించాడు.
‘మిమ్మల్ని చూస్తే సాక్షాత్తూ ఆ విష్ణుమూర్తినే చూసినట్లుంది. దయచేయండి స్వామీ! ఎలా ఉన్నారు? వైకుంఠం నుంచి ఎప్పుడు వచ్చారు? స్వామి ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు?’ అంటూ చెప్పులు కుట్టుకునేవాడు కూడా ప్రశ్నలతో నారదుని ముంచెత్తాడు.
‘స్వామి బాగానే ఉన్నారు.
నేను మళ్లీ అక్కడికే వెళ్తున్నాను.
నీ గురించి ఏమన్నా అడగమంటావా!’ అన్నారు నారదులవారు.
‘అడగడానికి ఇంకేముంది తండ్రీ! ఆ స్వామివారి కటాక్షం ఎప్పుడు లభిస్తుందో, నాకు మోక్షం ఎప్పుడు సిద్ధిస్తుందో కనుక్కోండి చాలు’ అని వేడుకున్నాడు చెప్పులు కుట్టుకునేవాడు.
అలాగేనంటూ నారదులవారు తిరిగి వైకుంఠానికి బయల్దేరారు.
వైకుంఠంలో నారదులవారు స్వామిని చూసిన వెంటనే, తాను భూలోకంలో కలిసి వచ్చిన భక్తుల గురించి చెప్పారు. వారి సందేహాలను కూడా స్వామి ముందు ఉంచారు.
‘నాలో ఐక్యమయ్యేందుకు ఆ ముని మరెన్నో జన్మలు వేచి ఉండాలి.
కానీ ఆ చెప్పులు కుట్టుకునే అతనిది మాత్రం ఇదే చివరి జన్మ’ అన్నారు విష్ణుమూర్త
స్వామివారి మాటలు విన్న నారదులవారు అయోమయంలో పడిపోయారు.
నిత్యం హరినామస్మరణ చేసే మునికి మరెన్నో జన్మలు ఉండటం ఏంటి? సాధారణ సంసారిగా జీవిస్తున్న ఆ చెప్పులు కుట్టుకునేవాడికి ఇదే ఆఖరు జన్మ కావడం ఏంటి? అన్న ఆలోచనలో మునిగిపోయాడు.
నారదుని మనసులో ఉన్న సంశయాన్ని కనిపెట్టారు స్వామి. ‘నీ అనుమానం తీరే ఉపాయం ఉంది.
నువ్వు ఈసారి వారిద్దరినీ కలిసినప్పుడు,
‘స్వామివారు ఏం చేస్తున్నారు?’ అని వాళ్లు అడుగుతారు కదా! అప్పుడు
‘ఆయన సూది బెజ్జంలోచి ఏనుగుని పంపిస్తున్నారు’ అని చెప్పు.
వారి స్పందన చూశాక నీకే అర్థమవుతుంది. ఎవరు గొప్ప భక్తులో!’ అన్నారు స్వామి.
విష్ణుమూర్తి చెప్పినట్లుగానే నారదుడు తిరిగి భూలోకానికి బయల్దేరాడు. ముందుగా ఆయనకి ముని ఎదురుపడ్డాడు.
ఎప్పటిలాగే నారదులవారిని కుశలప్రశ్నలు అడుగుతూ, పనిలో పనిగా ‘స్వామివారు ఏం చేస్తున్నారు?’ అని అడిగాడు ముని.
‘ఆ ఏముంది! వేలెడంత సూది బెజ్జంలోంచి కొండంత ఏనుగుని పంపిస్తున్నారు’ అన్నారు నారదులవారు. ‘భలేవారే! సూది బెజ్జంలోంచి ఏనుగుని పంపించడం ఎలా సాధ్యం. మీరు నాతో పరాచికాలు ఆడుతున్నట్లున్నారు, లేదా ఏదో భ్రాంతికి గురై ఉంటారు’ అన్నాడు ముని చిరునవ్వుతో.
నారదులవారు అక్కడి నుంచి సాగిపోయారు. మరికొంత దూరం వెళ్లాక ఆయనకి మునుపటి చెప్పులు కుట్టుకునే అతను కనిపించాడు.
‘అయ్యా! దయచేయండి! ఎక్కడి నుంచి రాక? ఈ మధ్య కాలంలో వైకుంఠానికి వెళ్లారా? స్వామివారు ఎలా ఉన్నారు?’ అని అడిగాడు ఆ చెప్పులు కుట్టుకునే అతను. ‘అంతా బాగానే ఉందయ్యా!
నేను వైకుంఠానికి వెళ్లే సమయంలో స్వామివారు ఒక సూదిబెజ్జంలోంచి ఏనుగుని ఎక్కిస్తున్నారు’ అన్నారు నారదులవారు. ‘మంచిది మంచిది. స్వామివారు తల్చుకుంటే సాధ్యం కానిది ఏముంది!’ అన్నాడు భక్తుడు.
‘అదేంటీ! స్వామివారు ఎంత గొప్పవారైతే మాత్రం అంత అసాధ్యమైన కార్యాన్ని చేయగలరని నువ్వు నమ్ముతున్నావా!’ అని ఆశ్చర్యంగా అడిగాడు నారదుడు. ‘భలేవారే భగవంతునికి అసాధ్యం అంటూ ఏముంటుంది. ఇదిగో ఈ మర్రి పండుని చూడండి.
ఈ మర్రి పండులో వేలాది గింజలు ఉన్నాయి కదా! ఆ గింజలన్నీ మళ్లీ మర్రి చెట్లుగా మారతాయి కదా! పోనీ అక్కడితో ఆగుతుందా…
ఆ మర్రి చెట్టు ఊడలు కిందకి దిగి విశాలమైన వనంగా మారుతుంది. ఇంత చిన్న పండులో అన్ని మహావృక్షాలు ఇమిడి ఉన్నప్పుడు స్వామివారు చేసినదానిలో ఆశ్చర్యం ఏముంది. సృష్టిలో ఇలాంటి అద్భుతాలన్నీ ఆయనకి సాధ్యమే కదా!’ అన్నాడు చెప్పులు కుట్టుకునేవాడు.
పైకి ఎంతో సాధారణంగా కనిపించే ఆ భక్తుని మనసులో భగవంతుని పట్ల ఉన్న విశ్వాసం ఎంత బలమైనదో నారదులవారికి అర్థమైంది. మోక్షం అతన్నే ఎందుకు వరించిందో తెలిసివచ్చింది.

జన్మలో సంపదలు

🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿🌿
పార్వతీదేవి " నాధా ! మానవ లోకములో కొంతమంది సుఖసంతోషాలతో సిరిసంపదలతో తులతూగుతుంటారు. సుఖాలను అనుభవిస్తుంటారు. కాని కొంతమంది దరిద్రంతో బాధపడుతుంటారు. దీనికి కారణం ఏమిటి ? " అని అడిగింది పార్వతి. 
పరమశివుడు " గతజన్మలో కాకులకు కూడా మెతుకులు పెట్టకుండా పిడికెడు భిక్షము వెయ్యకుండా పిసినారిగా గడిపిన వాడికి ఈ జన్మలో దారిద్ర్యంచుట్టుకుంటుంది. తినడానికి తిండి కట్టడానికి బట్టలేక బాధపడతాడు. అలా కాక పేదవారికి అన్నపానములు ఇచ్చిన వాడికి తన బంధువులను స్నేహితులను కష్టకాలంలో ఆదుకున్నవాడికి మరుజన్మలో సిరిసంపదలు కలుగుతాయి. సుఖంగా జీవిస్తారు. కనుక సుఖదుఃఖములు వారి వారి పూర్వజన్మ కర్మపరిపక్వత వలన కలుగుతుంది. అంతేకాని బ్రహ్మదేవుడికి ఒకరి మీద ప్రేమ మరొకరి మీద ద్వేషము ఉండదు. దేవుడు ఎవరిని పేదవాడుగా పుట్టించడు. ఎవరైనా ఈ జన్మలో పేదవాడుగా జన్మించి కష్టములు అనుభవిస్తున్నాడంటే అది అతడు పూర్వజన్మలో చేసిన పాపములఫలము అని తెలుసుకోవాలి. పార్వతీ ! కొంత మందికి సంపదలు ఉంటాయి కాని వారు కడుపునిండా తినరు, అనుభవించరు అలా సంపదఉన్నా దరిద్రము అనుభవిస్తుంటారు. ఎందుకో తెలుసా ! వీరు పూర్వ జన్మలో ఎవరికీ పిడికెడు అన్నము పెట్టి ఉండరు. బంధువులు, మిత్రులు పోరగా బలవంతంగా పరులకు ఉపకారం చేసి ఉంటారు. అలాంటి వారు సిరిసంపదలు ఉన్నా అనుభవించలేరు. కొంతమంది తమకు ఏమీ లేకపోయినా బంధుమిత్రుల సహాయంతో తిండికి గుడ్డకు లోటులేకుండా జీవిస్తుంటారు. అలాంటి వారు పూర్వజన్మలో తమకు శక్తి లేకపోయినా ఇతరులకు దానధర్మములు చేయవలెనని మనసులో ఘాఢంగా కాంక్షిస్తుంటాడు. అందువలన ఈ జన్మలో కూటికి గుడ్డకు లోటు లేకుండా జీవిస్తుంటారు. ఈ జన్మలో కొంతమంది అయాచితంగా ధనము లభిస్తుంది. అలాంటి వారు పూర్వజన్మలో పేదలకు అన్నదానము, ధనరూప దానము, వస్త్రదానము చేసి ఉంటారు. ఈ జన్మలో శ్రమతో ధనము సంపాదించే వారు పూర్వ జన్మలో ఎవరిని తిప్పించుకోకుండా పేదవారు అడగగానే దాన ధర్మములు చేసినవారు. కొంతమందికి ఎంత శ్రమపడ్డా ధనముచేకూరదు. అలాంటి వారు పూర్వజన్మలో లోభులై తమను యాచించిన వారిని రేపురా మాపురా అని తప్పించుకుని చివరకు మొండిచెయ్యి చూపి ఉంటారు. కొంత మందికి ముసలితనంలో అలాంటి వారు యవ్వనంలో ఉన్నప్పుడు దానధర్మములు చెయ్యకుండా ముసలితనంలో దానధర్మములు చేసినవారు. కొంతమంది తమకు మిక్కుటంగా ధనము కలిగినప్పటికీ వారికి ఉన్న రోగముల చేత తిండికూడా తినలేని స్థితిలో ఉంటారు. అలాంటి వారు పూర్వజన్మలో మంచిస్థితిలో ఉన్నప్పుడు దానము చేయకుండా వ్యాధిపీడితుడైన తరువాత దానధర్మములు చేసి ఉంటారు. ఈ జన్మలో అందంగా ఉన్నవారు పూర్వజన్మలో శాకాహారం తిన్నవారు. ఈ జన్మలో కురూపులుగా ఉన్నవారు పూర్వజన్మలో అందగాళ్ళై కురూపులను ఎగతాళి చేసి బాధించిన వారై ఉంటారు. పూర్వజన్మలో ఏకపత్నీవ్రతుడై ఉన్న వాడికి ఈ జన్మలో సౌందర్యవతీ, సౌశీల్యవతీ, గుణవతీ అయిన భార్య లభిస్తుంది. అలా కాక భార్యను కష్ట పెట్టినవాడికి ఈ జన్మలో భార్యాసుఖం దూరమౌతుంది. ఈ జన్మలో విద్యా, విజ్ఞానము, జ్ఞానము కలిగి ఉండికూడా పేదరికంతో బాధపడే వాడు క్రితం జన్మలో దానధర్మములు చేయాలి అని తెలిసి కూడా దానధర్మములు చేయని వాడే. ఈ జన్మలో తెలివితేటలు లేకపోయినా కూడా అధికంగా ధనము సంపాదించిన వాడు. కిందటి జన్మలో తెలివి తక్కువ వాడైనా పేదసాదలకు దానధర్మములు చేసిన వాడై ఉంటాడు. ఈ జన్మలో విద్యావంతుడు మేధావి అయిన వాడు పూర్వజన్మలో గురువులను సేవించి విద్యావంతుడై తాను నేర్చుకున్న విద్యను ఇతరులకు నేర్పించిన వాడై ఉంటాడు. కొంత
మందికి విద్య నేర్చుకోవాలని అనుకున్నా విద్య రాదు. అటువంటి వాడు పూర్వజన్మలో విద్యావంతులై గర్వించి సాటి విద్యావంతులను అవమానించి ఉంటారు. ఈ జన్మలో ఏరకమైన బాధలు లేకుండా రోగాలు లేకుండా భార్యా బిడ్డలతో సుఖంగా జీవిస్తున్న వారు పూర్వ జన్మలో సత్యము పలుకుచూ ఇతరుల మీదదయ చూపుతూ దానధర్మములు చేసినవారు. ఈ జన్మలో మాటవినని భార్య, మూర్ఖులైన కుమారులు, ఒంటి రోగముతో నిండా బాధపడే వారు కిందటి జన్మలో కోపంతోనూ, దురాశతోనూ, నాస్థికత్వముతో విర్రవీగిన వారు. ఈ జన్మలో పుట్టుగుడ్డి వాడు లేక మధ్యలో చూపుపోయిన వాడు పూర్వజన్మలో అందగాడై ఉండి ఇతరుల భార్యల వంక చెడుభావనతో చూసిన వాడు. ఈ జన్మలో చెవిపోటుతో బాధపడే వాడు పోయిన జన్మలో మంచి వారిని పరుషమైన మాటలతో బాధపెట్టినవాడై ఉంటాడు. ఉదరవ్యాధులతో బాధపడేవాడు పోయినజన్మలో ఇతరులకు విషం పెట్టినవాడు. మూత్రకోశ వ్యాధులతో బాధపడే వాడు పోయిన జన్మలో కన్యలను, పర కాంతలను శీలము కాజేసిన వాడు. ఈ జన్మలో క్షయరోగముతో బాధపడుతున్న వాడు పోయిన జన్మలో పరుల ఆహారమును అపహరించిన వాడై ఉంటాడు. ఈ జన్మలో కుష్టురోగముతో బాధపడే వాడు పూర్వ జన్మలో పరులను దారుణంగా హింసించిన వాడై ఉంటాడు. ఈ జన్మలో కుంటివాడుగా ఉన్నవాడు పోయిన జన్మలో పరుల కాళ్ళుచేతులు విరిచిన వారై ఉంటారు. ఈ జన్మలో చర్మరోగంతో బాధపడే వారు పోయిన జన్మలో మంచి వారిని హింసించిన వారు. ఈ జన్మలో పాదములకు రోగములు వచ్చిన వారు పోయినజన్మలో పాదములు కడగకుండా దేవుని వద్దకు వెళ్ళిన వారే. ఇంకా పేద వారిని, అమాయకులను నిష్కారణంగా పాదములతో తన్నినవారే. ఈ జన్మలో కడుపులో రోగములతోను, జ్వరముతోనూ, శరీరం అంతా రోగములతో బాధపడేవారు పోయినజన్మలో జంతువులను చంపినవారు గురువులను బాధపెట్టినవారు. ఈ జన్మలో గూనివాడు, మరగుజ్జువాడు పోయిన జన్మలో ధాన్యంలో తాలుగింజలు కలిపి అమ్మినవాడు, తప్పుడు కొలతలతో ప్రజలను
బాధపెట్టినవాడు. ఈ జన్మలో వెర్రివాడు పిచ్చివాడు పోయిన జన్మలో అమాయకులను మోసగించి ధనం సంపాదించినవారు. ఈ జన్మలో సంతానము లేనివారు పోయిన జన్మలో తల్లితండ్రులకు శ్రాద్ధం పెట్టనివారు, పసిపిల్లలను చంపినవారు. ఈ జన్మలో నపుంసకులు పోయినజన్మలో ఎద్దులకు వృషణాలు కొట్టినవారు. ఈ జన్మలో వైధవ్యము పొందిన వనిత పోయిన జన్మలో భర్తనుమోసగించి ధనము సంపాదించినది, తనభర్తను వదిలి మరియొకరి భర్తనుకోరింది. ఈ జన్మలో గొప్పవంశంలో పుట్టి కూడా చేయకూడని పనులు అందరూ ఏవగించుకునే పనులు చేసిన వారు పూర్వజన్మలో అహంకారంతో, గర్వంతో, మదంతో ఇతరులను అవమానించిన వారు. ఈ జన్మలో సేవకులుగా సేవకావృత్తి చేస్తూ యజమానులు పెట్టే బాధలను భరిస్తున్న వారు పూర్వజన్మలో అమాయకులను నిరపరాధులను కొడుతూ తిడుతూ హింసించినవారే. ఈ జన్మలో చెయ్యని నేరానికి శిక్ష అనుభవించేవారు. పూర్వజన్మలో నిరపరాధిని శిక్షించినవాడే. ఈ జన్మలో ఒక్కసారిగా బంధుమిత్రులను పోగొట్టుకున్నవాడు. పూర్వజన్మలో నిర్దాక్షిణ్యంగా ఎందరినో చంపినవాడు. ఈ జన్మలో తనకున్న ధనమును పోగొట్టుకున్న వాడు పూర్వజన్మలో తనదగ్గర దాచిన ఇతరుల ధనమును వారిని మోసము చేసి అపహరించిన వాడు. పార్వతీ నేను పైన చెప్పిన పాపములు చేసిన వారందరూ ముందు నరకము అనుభవించి తరువాత మానవులుగా పుట్టి ఆ కర్మ ఫలము అనుభవిస్తున్న వారే. క్రితము జన్మలో తక్కువ పాపములు చేసిన వాడు మానవుడుగా జన్మిస్తాడు. ఏ జన్మలో చేసిన పాపాలు ఆ జన్మలో అనుభవానికి రావు " అని పరమశివుడు పార్వతీదేవికి చెప్పాడు.

అష్టాక్షరీ మంత్ర మహిమ

" ఓం నమో నారాయణాయ " అను ఎనిమిది అక్షరముల యొక్క మంత్ర స్మరణము అనంత పుణ్యప్రదం, అనంత పాప రాశి ని ద్వంసం చేయగల శక్తి కలిగినది.ఇట్టి అష్టాక్షరి మంత్ర అధిష్టాన పురుషోత్తముడే శ్రీ మన్నారాయణుడు స్థితి కారకుడై అష్ట ఐశ్వర్యములను ప్రసాదించునప్పుడు లక్ష్మీనారాయణునిగా, విధ్యజ్ఞానము ప్రసాదించునపుడు లక్ష్మీ హయగ్రీవునిగా, ఆరోగ్య ప్రధాతగా నిలిచిన సమయాన ధన్వంతరిగా, సంకల్ప దీక్ష నొసగు లక్ష్మీ నారసింహునిగా, సమస్త మానసిక రుగ్మతలు తొలగించు లక్ష్మీ సుదర్శనునిగా, భక్తి జ్ఞాన వైరాగ్యములు ప్రసాదించు అనఘ దత్తత్రేయునిగా, సర్వ మంగళకరుడగు శ్రీ వేంకటనాయకుడైన వేంకటేశ్వరునిగా భక్తులకు సుఖ శాంతులను ప్రసాదించుచున్నాడు
మానవాళిని తరింపచేసే ఓ పవిత్ర మంత్రం గురించి ప్రత్యేకంగా వివరిస్తోంది నరసింహ పురాణం పదిహేడో అధ్యాయం. వ్యాసభగవానుడు తన కుమారుడైన శుక మహర్షికి ఆ మంత్రాన్ని గురించి వివరించాడు. సంసారబంధాల నుంచి విముక్తులు కావటానికి, మానవాళి జపించాల్సిన మంత్రం ఓంనమో నారాయణాయ అనేది. ఇది అష్టాక్షరి. అంటే ఎనిమిది అక్షరాలతో కూడుకొని ఉంటుంది. మంత్రాలన్నింటిలోకి ఎంతో ఉత్తమమైంది ఈ మంత్రం. నిత్యం దీన్ని జపిస్తే ముక్తి లభిస్తుంది. ఈ అష్టాక్షరిని జపించేటప్పుడు శ్రీమహావిష్ణువును మనసులో ధ్యానిస్తుండాలి. అలాగే పవిత్ర నదీప్రాంతాలలో, ఏకాంత ప్రదేశాలలో, జలాశయాల దగ్గర శ్రీమహావిష్ణు విగ్రహాన్ని ఎదురుగా పెట్టుకొని అష్టాక్షరిని జపించటం మేలు.
అష్టాక్షరిలో ఉండే ఒక్కొక్క అక్షరానికి ఒక్కో ప్రత్యేక వర్ణం ఉంది. వరుసగా
🌾ఓంకారం శుక్ల (తెలుపు) వర్ణం,
🌾నకారం రక్త (ఎరుపు) వర్ణం,
🌾మో అనే అక్షరం కృష్ణ (నలుపు),
🌾నా అనే అక్షరం ఎర్రగానూ,
🌾రా అనే అక్షరం కుంకుమరంగులోనూ,
🌾య అనే అక్షరం పసుపుపచ్చని రంగులోనూ,
🌾ణా అనే అక్షరం కాటుకరంగులోనూ ఉంటుంది.
ఓంనమోనారాయణాయ అనే ఈ మంత్రం ఇన్ని వర్ణాలతో విడివిడిగా ఉంటూ అన్ని వర్ణాల సమ్మిళితమైన తెల్లని రంగులో చివరకు కనిపించటం సత్వగుణ ప్రాధాన్యతను తెలుపుతుంది. ఈ మంత్ర ప్రభావం వల్ల స్వర్గ, మోక్ష ఫలాలతోపాటు కోరిన కోర్కెలు కూడా సిద్ధిస్తుంటాయి. దీనిలో సకల వేదార్థాలు నిండి ఉన్నాయని పండితులు విశ్లేషించి చెబుతుంటారు. ఈ మంత్రాన్ని స్నానం చేసి శుచి అయిన తర్వాత పవిత్ర ప్రదేశంలో కూర్చొని జపించాలి.
సర్వకాల సర్వావస్థలలోనూ తాను పవిత్రంగా ఉన్నాననుకొన్నప్పుడు భక్తుడు ఈ మంత్రాన్ని జపించవచ్చు. ఏ పనినైనా మొదలు పెట్టేటప్పుడు, పని అయిన తర్వాత దీన్ని జపించటం మేలు. ప్రతి నెలలోనూ ద్వాదశినాడు శుచి అయి, ఓంనమోనారాయణాయ అనే ఈ మంత్రాన్ని ఏకాగ్రచిత్తంతో వందసార్లు జపించాలి. అలా జపించిన వారికి మోక్ష స్థితులలోని సామీప్యస్థితి లభిస్తుంది. స్వామిని గంధపుష్పాలతో పూజించి ఈ మంత్రాన్ని జపిస్తే పాపాలు హరించుకుపోతాయి. అష్టాక్షరీ మంత్రజపంలో మొదటి లక్ష పూర్తి కాగానే ఆత్మశుద్ధి కలుగుతుంది. రెండో లక్ష పూర్తి అయ్యేసరికి మనశ్శుద్ధి, మూడో లక్ష పూర్తి అయినప్పుడు స్వర్గలోక అర్హత, నాలుగో లక్ష పూర్తికాగానే శ్రీహరి సామీప్యస్థితికి అర్హతలు లభిస్తాయి. అయిదు లక్షలసార్లు ఈ మంత్రజపం చేసిన వారికి నిర్మలజ్ఞానం కలుగుతుంది. ఆరో లక్షతో విష్ణులోకంలో స్థిర నివాస అర్హత, ఏడో లక్షతో స్వస్వరూప జ్ఞానం. ఎనిమిదో లక్షతో ముక్తి లభిస్తాయి. నిత్యజీవితంలో చేసుకొనే పనులు చేసుకుంటూనే అష్టాక్షరీ మంత్రాన్ని జపించవచ్చు.
నిత్యం ఈ మంత్రజపం చేసేవారికి దుస్వప్నాలు, పిశాచాలు, సర్పాలు, బ్రహ్మరాక్షసులు, దొంగలు, మోసగాళ్లు, మనోవ్యాధులు, వ్యాధులవల్ల బాధలుండవు. ఓంకారంతో మొదలయ్యే ఈ అష్టాక్షరీ మంత్రం ఎంతో విశేషమైందని వేదాలు కూడా వివరిస్తున్నాయి. జ్ఞానులు, మునులు, పితృదేవతలు, దేవతలు, సిద్ధులు, రాక్షసులు ఈ మంత్రాన్ని జపించి పరమసిద్ధిని పొందిన సందర్భాలున్నాయి. ప్రాణాన్ని విడిచే సమయంలో ఒక్కసారి ఈ మంత్రాన్ని అనుకున్నా వైకుంఠం లభిస్తుంది. వేదాన్ని మించిన శాస్త్రం, నారాయణుడిని మించిన దైవం లేదన్నట్లు ఈ మంత్రాన్ని మించిన మంత్రం మరొకటి లేదు. ఒక్కోసారి శ్రీమహావిష్ణువు ధరించిన దశావతారాల జయంతులు. పూజలు వస్తూ ఉంటాయి. అలాంటి సందర్భాలలో ఆయా అవతారాలకు సంబంధించిన మంత్రాలు కానీ, స్తోత్రాలు కానీ తెలియనప్పుడు ఓంనమోనారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రాన్ని నూటఎనిమిది సార్లు జపించినా ఆయా అవతారాల పూజాఫలితం దక్కుతుంది. అని ఇలా నరసింహ పురాణంలో సాక్షాత్తు వ్యాసభగవానుడే ఈ విషయాన్ని తన కుమారుడైన శుకయోగికి వివరించి చెప్పడంతో అష్టాక్షరీ మంత్ర ప్రభావం ఎంతటిదో తెలుస్తోంది.